కరీంనగర్

కల్లాల్లో ధాన్యం చోరీ... నలుగురు నిందితుల అరెస్టు...

తెలంగాణ గళం, వీణవంక: మద్యం, జల్సాలకు అలవాటు పడి రాత్రివేళల్లో రైతుల కల్లాల్లోని ధాన్యం బస్తాలను దొంగిలిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు…

By · · Updated

Share this article
కల్లాల్లో ధాన్యం చోరీ... నలుగురు నిందితుల అరెస్టు...

తెలంగాణ గళం, వీణవంక: మద్యం, జల్సాలకు అలవాటు పడి రాత్రివేళల్లో రైతుల కల్లాల్లోని ధాన్యం బస్తాలను దొంగిలిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.50 వేలకు పైగా విలువైన 37 బస్తాల ధాన్యం, చోరీకి ఉపయోగించిన కారు, నాలుగు చరవాణులు, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీణవంక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై ఆవుల తిరుపతి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

​కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన రైతు మడ్డి తిరుపతితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు రైతుల కల్లాల్లో ఉంచిన ధాన్యం బస్తాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితులు ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో బేతిగల్ గ్రామానికే చెందిన స్నేహితులు చొప్పరి అజయ్, గొట్టె విజయ్, తాడిచర్ల అనిల్, అంబాల శ్రీనివాస్ ఈ చోరీలకు పాల్పడినట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

​అనుమానం రాకుండా చోరీలు..

​నిందితులు నలుగురు మద్యానికి బానిసై, చిల్లర ఖర్చులు, జల్సాలకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాల బాట పట్టారు. పగటిపూట రహదారుల వెంట తిరుగుతూ రోడ్ల పక్కన, కల్లాల్లో పోసిన ధాన్యం కుప్పలను గమనించి రెక్కీ నిర్వహించేవారు. రాత్రివేళ ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకుని తెలుపు రంగు స్విఫ్ట్ కారు (టీఎస్ 02 యూడీ 7942)లో వెళ్లి చోరీ చేసేవారు. కల్లంలో 20 నుంచి 30 బస్తాలు ఉంటే అన్నీ ఒకేసారి తీసుకెళ్తే రైతులకు అనుమానం వస్తుందని భావించి, కేవలం రెండు నుంచి నాలుగు బస్తాలను మాత్రమే దొంగిలించేవారు. ఇలా గత పది రోజులుగా వీలుచిక్కినప్పుడల్లా బేతిగల్‌లో 23 బస్తాలు, జగ్గయ్యపల్లెలో 14 బస్తాల చొప్పున మొత్తం 37 వడ్ల బస్తాలను అపహరించారు. ఆ ధాన్యాన్ని జమ్మికుంటలోని ఓ దుకాణ యజమాని వద్దకు తీసుకెళ్లి, తాము నడుపుతున్న హార్వెస్టర్‌లో మిగిలిన ధాన్యమని నమ్మించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

​నిందితుల నుంచి మొత్తం 37 బస్తాల ధాన్యం, కారు, నాలుగు చరవాణులు, రూ.3 వేల నగదును రికవరీ చేసి, వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై వెంకట్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, మోహన్, కొమురయ్య, కానిస్టేబుళ్లు కుమార్, రవి, శ్రీధర్, వినీత్‌లను ఎస్సై ఆవుల తిరుపతి అభినందించారు.