గ్రామసభలో నిర్ణయం...
డిసెంబరు 1 నుంచి బెల్ట్ షాపుల రద్దు!
తెలంగాణ గళం - శంకరపట్నం ప్రతినిధి (నవంబర్ 26):
శంకరపట్నం మండలంలోని కాచాపూర్ గ్రామపంచాయతీ బెల్ట్ షాపుల రద్దుకు సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గ్రామసభలో ప్రజల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీకి తరలివచ్చి, బెల్ట్ షాపుల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ మాధవి, ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామసభ నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.
గ్రామంలో బెల్ట్ షాపులను డిసెంబరు 1 నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గ్రామసభలో ప్రకటించారు. నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.



