పరకాల తెలంగాణ గళం నవంబర్ 26
కారులో అక్రమంగా నాటుసారా (గుడుంబా) తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి సుమారు 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి. గురువయ్య ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది మొగిలిచెర్ల గ్రామ శివారులోని ఆర్‌అండ్‌బీ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అక్కంపేట గ్రామం నుంచి మొగిలిచెర్ల వైపు టాటా ఇండికా విస్టా కారులో గుడుంబా తరలిస్తున్న ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన రాచమల్ల సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా డ్రైవింగ్ సీటు కింద ప్లాస్టిక్ సంచిలో 10 కవర్లలో నిల్వ ఉంచిన సుమారు 20 లీటర్ల గుడుంబా బయటపడింది. దీంతో గుడుంబాను స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. నిందితుడిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్‌ఐలు కె. సాయిబాబా, ఎం. కిశోర్‌తో పాటు సిబ్బంది కొమురయ్య, హరిబాబు, విజయ్ కుమార్, దిలీప్ పాల్గొన్నారు.



