
క్వింటాల్‌కు రూ.3,500 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ప్రజావాణిలో రైతుల వినతి
మెట్పల్లి, నవంబర్ 09,తెలంగాణ గళం:
ప్రభుత్వం సూచించిన వరి రకాలను సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం మెట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు వినతిపత్రం సమర్పించారు. మొన్నటి వరకు క్వింటాల్ వరి ధాన్యానికి రూ.4 వేల వరకు ధర పలకగా, ప్రస్తుతం దళారులు కేవలం రూ.2,600కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సూచించిన సన్న రకం వరిని సాగు చేసినప్పటికీ పెట్టుబడి ఖర్చులు గణనీయంగా పెరిగాయని, మరోవైపు దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వాపోయారు.
రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి కనీసం రూ.3,500 మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.



