ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ 22 (తెలంగాణ గళం): తెలంగాణ రాష్ట్రంలోని ప్రింటింగ్ పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థతో పాటు తెలుగు అకాడమీ నుంచి రావాల్సిన ₹111 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రింటింగ్ సంస్థలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను నిర్ణీత గడువులోగా ముద్రించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏటా తెలంగాణకు చెందిన 60కి పైగా ప్రింటింగ్ సంస్థలు టెండర్లలో పాల్గొని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించి అందిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా ప్రింటర్లకు రావాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణకు సంబంధించి గత మూడేళ్లుగా సుమారు ₹76 కోట్లు, తెలుగు అకాడమీకి సంబంధించి గత నాలుగేళ్లుగా ₹35 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు. బకాయిల విడుదల కోసం పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ, తెలుగు అకాడమీ డైరెక్టర్లు, సంబంధిత కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని ప్రతినిధులు తెలిపారు. దీంతో మీడియా ద్వారా తమ గోడును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రింటింగ్ పరిశ్రమలపై ప్రత్యక్షంగా సుమారు 15 వేల మంది, పరోక్షంగా మరో 10 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. బిల్లులు రాకపోవడంతో సిబ్బంది వేతనాలు, పరిశ్రమల అద్దెలు, కరెంట్ బిల్లులు, కాగితం మరియు ఇతర ముడిసరుకుల సరఫరాదారులకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అనేక ప్రింటింగ్ సంస్థలు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణకు సంబంధించి పెండింగ్లో ఉన్న ₹76 కోట్లను తక్షణమే విడుదల చేయాలని అసోసియేషన్ కోరింది. అలాగే తెలుగు అకాడమీకి సంబంధించి పెండింగ్లో ఉన్న ₹35 కోట్లకు పైగా బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో టెండర్లు నిర్వహించే ముందే అవసరమైన బడ్జెట్ను మంజూరు చేసి, ప్రింటింగ్ సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన తెలంగాణ ప్రింటింగ్ పరిశ్రమలు సుమారు 25 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్నాయని, వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఈ పరిశ్రమలను కాపాడేందుకు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డి. వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ రెడ్డి, కోశాధికారి ఏ. ఉత్తమ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె. స్వామి రెడ్డి, సంయుక్త కార్యదర్శి వి. అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు పి. శ్రీనివాస్ రెడ్డి, కె. తేజ, సభ్యులు ఎం.డి. అబ్దుల్ రవూఫ్, కె. జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రింటింగ్ పరిశ్రమలను ఆదుకోండి: ₹111 కోట్లకు పైగా బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ 22 (తెలంగాణ గళం): తెలంగాణ రాష్ట్రంలోని ప్రింటింగ్ పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థతో పాటు తెలుగు అకాడమీ నుంచి రావాల్సిన…
By తెలంగాణ గళం · · Updated
Share this article



