- విద్యార్థినుల ఫిర్యాదులపై అధికారుల మౌనమేల? జేబీఎస్ పాఠశాల ఎదుట పీడీఎస్‌యూ ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్....
-కలెక్టర్, డీఈవో స్పందించాలని డిమాండ్...
-బాలికల భద్రతపై రాజీ ఎందుకు?
By Lakavath Sudhir:
ఇల్లందు, నవంబర్ 9 (తెలంగాణ గళం): విద్యాబుద్ధులు నేర్పించి భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడిపైనే విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఇల్లందు పట్టణంలోని జేబీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ హిందీ ఉపాధ్యాయుడు కొంతకాలంగా మైనర్ విద్యార్థినులను మానసికంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు సోమవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పాఠశాల గేటు ఎదుట నిరసన చేపట్టారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, జిల్లా కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన ఉపాధ్యాయుడిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు కులాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల క్రితం రోంపేడు గిరిజన బాలికల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి రావడం విద్యాసంస్థల్లో బాలికల భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు.
విచారణ పేరుతో కాలయాపన.. ఇంకెంతకాలం?
విద్యార్థినుల భద్రతకు భరోసా కల్పించాల్సిన అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని పీడీఎస్‌యూ నాయకులు నిలదీశారు. మైనర్ బాలికల విషయంలో ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయా? విద్యార్థినులకు న్యాయం చేయాల్సిన అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆరోపణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారణ అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సదరు ఉపాధ్యాయుడిని విద్యార్థినులకు దూరంగా ఉంచడంతోపాటు, విధుల నుంచి తప్పించే చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్, డీఈవో తక్షణమే స్పందించి విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పీడీఎస్‌యూ ఇల్లందు డివిజన్ నాయకులు గంగాధర్, గణేష్, ఆయుష్, హేమచంద్ర, నాగచైతన్య, పండు తదితరులు పాల్గొన్నారు.
బాలికల భద్రతపై రాజీ ఎందుకు?
పాఠశాలలు విద్యార్థినులకు భద్రత కల్పించే కేంద్రాలుగా ఉండాలి తప్ప, భయాందోళనలకు నిలయాలుగా మారకూడదు. పోక్సో చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం, వాటిపై చర్యల్లో జాప్యం జరగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. బాలికల భద్రత విషయంలో అధికారులు ఇప్పటికైనా బాధ్యతగా స్పందిస్తారా? లేక మరో ఘటన జరిగే వరకు వేచి చూస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.



