• ఆధ్యాత్మిక వేడుకకు దాతల భారీ ఆర్థిక చేయూత...
• అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వేడుకలు...
• వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగుతున్న మూడు గ్రామాల వీధులు...
తెలంగాణ గళం, వీణవంక ప్రతినిధి కట్ట రాకేష్ (నవంబర్15):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న 'శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి సమేత బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన' మహోత్సవానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గ్రామ దేవతలపై అంచంచలమైన భక్తి-విశ్వాసాలు... సంప్రదాయాల పరిరక్షణపై మమకారం.. ఊరి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటాలనే సంకల్పం... వెరసి గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, గ్రామాభిమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారీగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. దీంతో గ్రామస్థుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
రూ.2,00,016 విరాళమిచ్చిన ప్రణవ్ : కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితెల ప్రణవ్ బాబు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి రూ.2,00,016 విరాళంగా అందజేశారు. గ్రామ ఆధ్యాత్మిక కార్యక్రమం పట్ల ఆయన చూపిన ప్రత్యేక అభిమానం, అందించిన భారీ ఆర్థిక సహకారం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.
పాడి ఉదయానందన్ రెడ్డి రూ.1,16,000 విరాళం: ప్రముఖ పారిశ్రామికవేత్త, యప్ టీవీ, ట్యూరిటో సంస్థల అధినేత పాడి ఉదయానందన్ రెడ్డి ఈ మహోత్సవానికి రూ.1,16,000 విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆయన చూపిన ఆదరణకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ ఈటల రాజేందర్ రూ.50,016 ఆర్థిక సహాయం:
మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కూడా బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి రూ.50,016 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ కర్ర విజయ భగవాన్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా పెద్ది మల్లారెడ్డి, ఎనగంటి శ్రీనివాస్, మాడ రాజిరెడ్డి, తాటిపాముల రాజు, గుంటి రాజయ్య, గుంటి శ్రీను, బొడిపల్లి విష్ణు, పొడపత్రపు సతీష్, పోతుల విజయ్, ఎలుబాక వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ దేవతల పునఃప్రతిష్ఠాపన అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా గ్రామ ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందిస్తున్న సహకారం గ్రామ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తమ గ్రామ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు ఆర్థిక సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క దాతకు రెడ్డిపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.


