తాజా వార్తలు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా!

నవంబర్‌ 19న నూతన పింఛన్ల నగదు జమ, కుటుంబ బీమా పథకం ప్రారంభం.. సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిశానిర్దేశం. Lakavath Sudhir: ఇల్లందు, నవంబర్ 14 (తెలంగాణ గళం): రాష్ట్రంలోన…

By · · Updated

Share this article
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా!

నవంబర్‌ 19న నూతన పింఛన్ల నగదు జమ, కుటుంబ బీమా పథకం ప్రారంభం.. సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిశానిర్దేశం.

Lakavath Sudhir:

ఇల్లందు, నవంబర్ 14 (తెలంగాణ గళం): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం చారిత్రాత్మక నిర్ణయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 19న స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నూతన పింఛన్‌దారుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తింపజేసే ఈ పథకానికి మంత్రిమండలి తీర్మానించిందన్నారు. నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు సేకరించనున్నట్లు వెల్లడించారు.

సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, నూతన పింఛన్లు వంటి పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతి గడపను తట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి ప్రజల ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తారని, వారి ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.