తాజా వార్తలు

పీజీ చదువులు.. ఈజీ మనీ కోసం చోరీలు!

ఇల్లందులో 10 ఇళ్లకు కన్నం.. ముగ్గురి అరెస్ట్‌.. రూ.27.51 లక్షల సొత్తు స్వాధీనం By Lakavath Sudhir: ఇల్లందు, నవంబర్‌ 7 (తెలంగాణ గళం): చదువుకున్నారు.. మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన యువకులు సుల…

By · · Updated

Share this article
పీజీ చదువులు.. ఈజీ మనీ కోసం చోరీలు!

ఇల్లందులో 10 ఇళ్లకు కన్నం.. ముగ్గురి అరెస్ట్‌.. రూ.27.51 లక్షల సొత్తు స్వాధీనం

By Lakavath Sudhir:

ఇల్లందు, నవంబర్‌ 7 (తెలంగాణ గళం): చదువుకున్నారు.. మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన యువకులు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో దొంగతనాల బాట పట్టారు. రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడ్డారు. ఇలా ఇల్లందు పట్టణంలో 10 ఇళ్లలో దొంగతనాలు చేసిన ముగ్గురు చివరకు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ.27.51 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌ శనివారం వెల్లడించారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిని లోథ్‌ విశాల్‌కుమార్‌ (24), గౌతమ్‌ లోధ్‌ (26), కోరి కల్యాణ్‌ (20)గా గుర్తించారు. వీరు ఇల్లందులోని 14, 15వ బస్తీలకు చెందినవారు. జేకే కాలనీ, సుభాష్‌నగర్‌, ఆజాద్‌నగర్‌, వెంగల్‌రావు కాలనీ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఇద్దరు పీజీ చదివినవారు ఉండటం గమనార్హం.

నిందితుల నుంచి 165 గ్రాముల బంగారం, 2 కిలోల 205 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వరుసగా రూ.23.10 లక్షలు, రూ.4.41 లక్షలుగా అంచనా వేశారు. వీటితోపాటు ఒక ల్యాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్‌ కానిస్టేబుల్‌ రవికుమార్‌కు ఎస్పీ రివార్డు అందజేశారు. ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రోహిత్‌రాజ్‌, డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్‌, ఎస్సైలు అభినందించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

Tags: