ఆలయంలో ఉన్న ముగ్గురికి, డ్రైవర్‌కు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. ధ్వంసమైన ద్విచక్రవాహనం.. గతంలోనూ ప్రమాదాలు.. అయినా అధికారుల్లో లేని చలనం.
By:Lakavath Sudhir
ఇల్లందు, నవంబర్ 12 (తెలంగాణ గళం): పట్టణంలోని 18వ వార్డు పల్లె ప్రకృతి వనం సమీప బైపాస్ రోడ్డులో గురువారం రాత్రి సుమారు 7:30 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం వైపు నుంచి కాగితాల లోడుతో వస్తున్న లారీ ప్రమాదకరమైన మూలమలుపు వద్ద అదుపుతప్పి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వైపు దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో ఆలయం వద్దకు వచ్చిన ముగ్గురు భక్తులు లారీకి సమీపంలోనే ఉండటంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ లారీ పక్కనే ఉన్న మట్టిదిబ్బపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు భక్తులతోపాటు లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సమీపంలో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనం ధ్వంసమైంది.
కనిపించని వీధి దీపాలు.. రక్షణ కంచెలు,ప్రమాద సూచికలు:
ఈ బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద రాత్రివేళ సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలుపు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ వాహనదారులను అప్రమత్తం చేసే సూచిక బోర్డులు, రక్షణ కంచెలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఎదురైనట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు.
ఇప్పటికైనా స్పందించాలి:
రోడ్డుకు ఇరువైపులా రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, ప్రమాద సూచిక బోర్డులు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. పనిచేయని వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టి రాత్రివేళ నిరంతరం వెలుతురు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



