
స్నేహితుడి ఇంట్లోనే చోరీకి పాల్పడిన యువకుడు.. మూడు విడతలుగా బంగారం తాకట్టు
మెట్‌పల్లి, నవంబర్ 06,తెలంగాణ గళం:
పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ ఇంట్లో బీరువాలో భద్రపరిచిన సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చైతన్య నగర్‌కు చెందిన ఇందూరి నవీన్ (26) ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడని మెట్‌పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి కాలనీకి చెందిన తలారి లావణ్య ఈ ఏడాది అక్టోబర్ 14న తన ఇంటి బీరువాలోని లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వాటిలో 4.5 తులాల పెద్ద బంగారు గొలుసు, 2 తులాల నెక్లెస్, అర తులం బంగారు కమ్మలు, బుట్టలు, అర తులం ఉంగరం, అర తులం బంగారు మాటీలు ఉన్నాయి. మొత్తం సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్నేహితుడి ఇంటినే లక్ష్యంగా చేసుకొని..
దర్యాప్తులో భాగంగా బాధితురాలి కుమారుడు అభినవ్ స్నేహితుడైన ఇందూరి నవీన్‌పై పోలీసులకు అనుమానం కలిగింది. తరచూ అభినవ్ ఇంటికి వెళ్లే నవీన్‌కు బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్న విషయం తెలిసినట్లు పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో చోరీకి పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం అభినవ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బీరువాలోని బంగారు ఆభరణాలను నవీన్ చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం మెట్‌పల్లిలోని మణప్పురం గోల్డ్ లోన్స్‌లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. తాకట్టు ద్వారా వచ్చిన డబ్బులతో తన అప్పులు తీర్చడంతో పాటు, మిగిలిన మొత్తాన్ని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి విలాసాలకు ఖర్చు చేసినట్లు తెలిపాడు.
సెల్‌ఫోన్, తాకట్టు రసీదులు స్వాధీనం
నవంబర్ 6వ తేదీ ఉదయం నిందితుడు ఇందూరి నవీన్‌ను అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌తో పాటు, మణప్పురం గోల్డ్ లోన్స్‌లో బంగారం తాకట్టు పెట్టినట్లు తెలిపే రసీదులు, స్టేట్‌మెంట్లను ఇద్దరు పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ వెల్లడించారు.


