ఇందిరాగాంధీ ఆశయాలే ప్రజా ప్రభుత్వానికి స్ఫూర్తి పేదల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోరం కనకయ్య
Lakavath Sudhir:
ఇల్లందు, నవంబరు 19 (తెలంగాణ గళం): దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం, ప్రజాసేవా దృక్పథం భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'గరీబీ హటావో' నినాదంతో సామాన్య ప్రజల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. బ్యాంకుల జాతీయీకరణ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటంలో ఆమె పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు.
గురువారం రాఘబోయినగూడెం గ్రామపంచాయతీతోపాటు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరాగాంధీ 109 జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తితో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఆరు గ్యారంటీలతోపాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట వేదికగా 'ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.



