తాజా వార్తలు

గురువుల తప్పిదాలకు గొడుగు.. విద్యార్థుల భవిష్యత్తుకు చీకటి!

ఒకరి సస్పెన్షన్‌ ఎత్తివేత.. మరొకరిపై చర్యలకు మీనమేషాలు 18న ఇల్లందు మండల పరిధిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు. Lakavath Sudhir: ఇల్లందు, నవంబర్‌ 16 (తెలంగాణ గళం): విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుత…

By · · Updated

Share this article
గురువుల తప్పిదాలకు గొడుగు.. విద్యార్థుల భవిష్యత్తుకు చీకటి!

ఒకరి సస్పెన్షన్‌ ఎత్తివేత.. మరొకరిపై చర్యలకు మీనమేషాలు 18న ఇల్లందు మండల పరిధిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు.

Lakavath Sudhir:

ఇల్లందు, నవంబర్‌ 16 (తెలంగాణ గళం): విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 18న ఇల్లందు మండల పరిధిలో విద్యాసంస్థల బంద్‌ నిర్వహించనున్నట్లు పీడీఎస్‌యూ నాయకులు గంగాధర గణేష్‌, నాగేంద్రబాబు ప్రకటించారు. సోమవారం ప్రజాపంథా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు విద్యాశాఖ అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్రిగూడెం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌ విధులకు గైర్హాజరవుతూ జీతభత్యాలు పొందినట్లు ఆరోపణలు రావడంతో ఐదుగురు ఎంఈఓలతో విచారణ జరిపించి నవంబర్‌ 5న సస్పెండ్‌ చేశారని తెలిపారు. అయితే వారం రోజులకే సస్పెన్షన్‌ ఎత్తివేసి సమీప పాఠశాలలో తిరిగి పోస్టింగ్‌ కల్పించడంపై ప్రశ్నించారు. మరో ఉపాధ్యాయుడు వెంకట్రాములుపై విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడాన్ని తప్పుబట్టారు.

ఇద్దరు ఉపాధ్యాయుల వ్యవహారాల్లో విద్యాశాఖ అధికారులు అనుసరిస్తున్న వైఖరి అనుమానాలకు తావిస్తోందని, విచారణలు నామమాత్రంగా సాగుతున్నాయని విమర్శించారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు కంటే తప్పిదాలకు పాల్పడిన ఉపాధ్యాయులను కాపాడటానికే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారా? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్యాశాఖ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 18న చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ నాయకులు ఆయుష్‌, శ్రావణి, హేమచంద్ర, రోహిత్‌, నాగచైతన్య, లక్ష్మీనరసింహ, అస్లాం, విష్ణు, కార్తీక్‌, జస్వంత్‌, గౌతమ్‌, నాగేంద్రబాబు, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.