తాజా వార్తలు

అర్హులందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే కోరం

ఇల్లందు నియోజకవర్గానికి 3,971 కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కనకయ్య ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే కోరం కనకయ్య Lakavath Sudhir: ఇల్ల…

By · · Updated

Share this article
అర్హులందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే కోరం

ఇల్లందు నియోజకవర్గానికి 3,971 కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కనకయ్య

ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే కోరం కనకయ్య

Lakavath Sudhir:

ఇల్లందు, నవంబర్ 13 (తెలంగాణ గళం): అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్లతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,971 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఇందులో ఇల్లందు మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో 846 మందికి, ఇల్లందు పురపాలక పరిధిలో 349 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇది ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని విడతలవారీగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బానోత్‌ రాంబాబు, పురపాలక ఛైర్మన్‌ దొడ్డ కిరణ్‌ మిత్ర డానియల్‌, వైస్‌ ఛైర్మన్‌ పెండెల రాజు, ఎంపీడీవో ధన్‌సింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సందీప్‌, పట్టణ, మండల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు బోళ్ల సూర్యం, రామ్‌ మహేష్‌, దిశా కమిటీ సభ్యురాలు, సర్పంచ్ బానోత్ శారద, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, గ్రామాల సర్పంచులు, గ్రామ, పట్టణ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.