దామెరలో నూతన చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల తెలంగాణ గళం నవంబర్ 17
దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలోని వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత మరియు గీత కార్మికులకు నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత మరియు గీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత ఆసరా పింఛన్లను అందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు, పింఛన్ల విషయంలో ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల భారంలోకి నెట్టారని విమర్శించారు.
మహిళల ఆర్థిక స్వావలంబన, అభివృద్ధి లక్ష్యంగా పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందని ఎమ్మెల్యే తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.




