82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
రూ.82.09 లక్షల విలువైన చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్‌పల్లి, నవంబర్ 04,తెలంగాణ గళం:
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
మెట్‌పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మెట్‌పల్లి పట్టణం, మండల పరిధికి చెందిన 82 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.82,09,512 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలు తమ ఆడబిడ్డల వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వివాహాలు భారంగా మారకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సాయం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని అన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


