ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కనులపండువగా ఆధ్యాత్మిక వేడుక.. ఎనిమిది అడుగుల మట్టి శివలింగానికి 70 మంది నాగశివ సాధువులచే మహాభిషేకం.
By Lakavath Sudhir:
ఇల్లందు, నవంబర్ 28 (తెలంగాణ గళం): ఓంకార నాదంతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ.. హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణతో ఇల్లందు పట్టణం శివమయంగా మారనుంది. లోకకల్యాణం, సకల జీవుల శ్రేయస్సు, సుఖశాంతులను కాంక్షిస్తూ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి గ్రౌండ్లో రేపు మహా రుద్రాభిషేక మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మహోత్సవంలో ప్రధాన ఆకర్షణగా 8 అడుగుల ఎత్తైన మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి, 70 మంది నాగశివ సాధువులచే పరమశివునికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, రుద్రపారాయణం, శివనామస్మరణ మధ్య జరగనున్న ఈ పవిత్ర అభిషేక కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది. భక్తి పారవశ్యంతో శివనామస్మరణ చేస్తూ భక్తులు పరమశివుని సేవలో తరించేందుకు ఈ మహోత్సవం వేదిక కానుంది.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
మహా రుద్రాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సింగరేణి గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. మహోత్సవానికి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు సమకూర్చాలని నిర్వాహకులకు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పరమశివుని దర్శనం, అభిషేక కార్యక్రమాల్లో భక్తులు ప్రశాంతంగా పాల్గొనేలా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి దంపతులు
ఈ మహా రుద్రాభిషేక మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
భక్తులందరికీ ఎమ్మెల్యే ఆహ్వానం
నియోజకవర్గ ప్రజలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి శివభక్తులు, ఆధ్యాత్మిక ప్రియులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ మహా రుద్రాభిషేక మహోత్సవంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. భక్తితో పరమశివుని స్మరిస్తూ అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.
ఓం నమః శివాయ.. హరహర మహాదేవ! అంటూ ఇల్లందు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగిపోయేందుకు సిద్ధమవుతోంది.






