వ్యాపారాలు అభివృద్ధి చెందాలి..వ్యాపారులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి :జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
జగిత్యాల పట్టణంలోని పలు వ్యాపార సంస్థల్లో నిర్వహించిన లక్ష్మీ పూజలు, ఖాతా ముహూర్తం కార్యక్రమాలకు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం వ్యాపార యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపార సంస్థలు రోజురోజుకూ అభివృద్ధి చెందాలని, వ్యాపారులు ఆర్థికంగా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, వ్యాపారులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.


