మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ..
హాజరు రిజిస్టర్ పరిశీలన, అధికారులకు కీలక ఆదేశాలు
పరకాల తెలంగాణ గళం నవంబర్ 10,
పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది
లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పరకాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారులు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి విధులకు హాజరుకాని అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
మున్సిపల్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

అనంతరం పట్టణ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మున్సిపల్ సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ తనిఖీలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



