తెలంగాణ

మెదక్ జిల్లాలో ఎండిన వరి పంటలపై సమగ్ర సర్వే చేపట్టాలి

శివ్వంపేట, నవంబర్ 4  (తెలంగాణ గళం):మెదక్ జిల్లాలో ఎండిపోయిన వరి పంటలపై అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్ష…

By · · Updated

Share this article
మెదక్ జిల్లాలో ఎండిన వరి పంటలపై సమగ్ర సర్వే చేపట్టాలి

శివ్వంపేట, నవంబర్ 4  (తెలంగాణ గళం):మెదక్ జిల్లాలో ఎండిపోయిన వరి పంటలపై అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మైసయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన జాబితాలో మెదక్ జిల్లాలోని 21 మండలాలకు గాను కేవలం మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే చేర్చడం బాధాకరమన్నారు. పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించి, మిగిలిన 20 మండలాలను విస్మరించడం వల్ల ఆయా ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో అధిక శాతం మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా అనేక గ్రామాల్లో వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మరో వారం నుంచి పది రోజుల్లో జిల్లావ్యాప్తంగా వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులతో ప్రతి గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించాలని, ఎండిపోయిన వరి పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై స్వయంగా స్పందించి మెదక్ జిల్లా రైతుల పరిస్థితిని పరిశీలించాలని కోరారు. కేవలం ఒక మండలానికే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో పంట నష్టాన్ని పరిశీలించి, అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసి, ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి, మెదక్ జిల్లా రైతుల తరఫున మైసయ్య యాదవ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Tags: