మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహచర నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అలాగే, రాష్ట్రానికి ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ (INTUC) అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల జిల్లా ఓబీసీ (OBC) చైర్మన్ వొడ్డె రాజమౌళి తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొని ముఖ్యమంత్రికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.



