పూజా సామాగ్రి నుంచి కొత్త దుస్తులు, బాణాసంచా వరకు కొనుగోళ్ల సందడి.. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ
పరకాల, తెలంగాణ గళం, నవంబర్ 8:
దీపావళి పండుగను పురస్కరించుకుని పరకాల పట్టణ ప్రధాన మార్కెట్ ఆదివారం జనసందోహంతో కిటకిటలాడింది. పండుగకు అవసరమైన వస్తువుల కొనుగోళ్ల కోసం ఉదయం నుంచే పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు.
కుటుంబ సమేతంగా వచ్చిన ప్రజలతో మార్కెట్ పరిసరాలు పండుగ సందడిని సంతరించుకున్నాయి.
కేదారేశ్వర వ్రతం, లక్ష్మీ పూజల కోసం మట్టి ప్రమిదలు, కుండలు, వెదురు బుట్టలు, తడికలు, గుమ్మడికాయలు, ఇతర పూజా సామాగ్రిని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేశారు. అదేవిధంగా కొత్త దుస్తులు, బాణాసంచా, స్వీట్లు, పండ్లు, పూల కొనుగోళ్లతో దుకాణాలన్నీ రద్దీగా మారాయి.
పండుగను పురస్కరించుకుని వ్యాపారులు తమ దుకాణాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించి వినియోగదారులను ఆకట్టుకున్నారు.
మార్కెట్‌కు ప్రజలు భారీగా తరలిరావడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, పాదచారుల రాకపోకలతో మార్కెట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
అయినప్పటికీ పండుగ ఉత్సాహంతో ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తూ సందడి చేశారు. మరోవైపు కొనుగోళ్లు ఊపందుకోవడంతో చిరు వ్యాపారులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
గత రెండు రోజులుగా పరకాల మార్కెట్‌లో ఇదే తరహా రద్దీ కొనసాగుతోందని స్థానిక వ్యాపారులు తెలిపారు.
దీపావళి పండుగకు మరుసటి రోజు మాత్రమే ఉండటంతో సోమవారం కొనుగోళ్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తంగా దీపావళి పండుగ వేళ పరకాల మార్కెట్ వ్యాపార సందడితో కళకళలాడుతోంది.



