విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన డాక్టర్ సంధ్య
పరకాల తెలంగాణ గళం
నవంబర్ 17
హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సంధ్య పాఠశాలను సందర్శించి విద్యార్థులందరికీ ఉచితంగా సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థుల శారీరక ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ.. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సంధ్య సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు.
ఈ జాగ్రత్తలతో అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం వారి విద్యాభ్యాసంపై ఎంతో ప్రభావం చూపుతుందని అన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, విలువైన సూచనలు అందించిన డాక్టర్ సంధ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లకవద్దేవా, కంచ రాజ్ కుమార్, పుల్లూరి రామకృష్ణ, బండి శ్వేత, ఏఎన్ఎం కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



