తెలంగాణ

శివనామస్మరణతో మార్మోగిన కుంకుమేశ్వర ఆలయం - లక్షదీపార్చన, జ్వాలా తోరణంతో భక్తుల పులకింత

లక్ష దీపాల వెలుగుల్లో పరకాల కుంకుమేశ్వరాలయం.. కార్తిక పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటిన భక్తిభావం! పరకాల, తెలంగాణ గళం, నవంబర్ 24 : కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పరకాల పట్…

By · · Updated

Share this article
శివనామస్మరణతో మార్మోగిన కుంకుమేశ్వర ఆలయం - లక్షదీపార్చన, జ్వాలా తోరణంతో భక్తుల పులకింత

లక్ష దీపాల వెలుగుల్లో పరకాల కుంకుమేశ్వరాలయం..

కార్తిక పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటిన భక్తిభావం!

పరకాల, తెలంగాణ గళం, నవంబర్ 24 :

కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఉదయం 4 గంటల నుంచే రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం లక్షదీపార్చన, జ్వాలా తోరణం, మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోమల్లపల్లి సంపత్ కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

లక్షదీపార్చనతో దేదీప్యమానంగా ఆలయం

కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్షదీపార్చన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించడంతో ఆలయమంతా దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తిక మాసంలో దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

అనంతరం నిర్వహించిన జ్వాలా తోరణం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్వాలా తోరణం కిందుగా వెళ్లడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ భక్తితో కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయంత్రం ఆకాశ దీపోత్సవం

సాయంత్రం నిర్వహించిన ఆకాశ దీపోత్సవం వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా భక్తులు దీపాలను ఆకాశంలోకి వదులుతూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలకు హాజరైన భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Tags: