రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
పరకాల తెలంగాణ గళం నవంబర్ 19
నడికూడ మండలం రామకృష్ణాపురం నుంచి ధర్మారం వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కంటాత్మకూర్ మాటువాగును అధికారులతో కలిసి పరిశీలించారు.
మాటువాగు వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా ఈదుల చెరువు, బంటోనీ చెరువు, శాలకుంట చెరువులకు నీటిని అందించేందుకు ప్రతిపాదించిన మోటార్ పంపింగ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పథకం అమలు, సాగునీటి వసతులపై స్థానిక రైతులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తుందని, మిగిలిన 25 శాతం వాటాను రైతులందరూ సమష్టిగా భరించి సహకరించాలని కోరారు.
రైతులందరూ కమిటీగా ఏర్పడి ఐకమత్యంతో ముందుకు వస్తే మూడు చెరువులను నీటితో నింపి సాగునీటి సౌకర్యం కల్పించవచ్చని, తద్వారా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.



