ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
66వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించిన డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్
హసన్‌పర్తి, నవంబర్ 21, (తెలంగాణ గళం):
ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ అన్నారు.
శనివారం హసన్‌పర్తి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గొర్రె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబ పెద్దకు రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా రక్షణ కల్పిస్తోందని కొనియాడారు. ఇప్పటికే రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే చేయూత పింఛన్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి భవనాలు, రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీల పెంపు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో విద్యారంగాన్ని బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకుని లబ్ధి పొందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ, బీసీ, మైనారిటీ విభాగాల నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



