లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల తెలంగాణ గళం నవంబర్ 15
పేదల సంక్షేమం, సామాజిక భద్రతే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అందించడం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు నూతన పింఛన్లు మంజూరు చేసి ప్రభుత్వం అండగా నిలవడం సంతోషకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.



