పరకాల,తెలంగాణ గళం, నవంబర్ 22:
పరకాల: మున్సిపాలిటీ 12వ వార్డులో దోమల నివారణకు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి కౌన్సిలర్ ఆకుల లావణ్య, శ్రీధర్ దోమల మందు పిచికారి చేయించారు.
వార్డులోని ప్రధాన రహదారులు, అంతర్గత కాలనీలు, డ్రైనేజీలు, మురికి నీరు నిలిచిన ప్రాంతాల్లో మందు పిచికారి చేశారు. వర్షాకాలం, వాతావరణ మార్పుల నేపథ్యంలో దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.
వార్డు ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, దోమల నివారణ కోసం నిరంతరం పిచికారి చేయిస్తామని కౌన్సిలర్ తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల నివారణకు అందరూ సహకరించాలని కోరారు.



