పరకాల, తెలంగాణ గళం,నవంబర్ 17:
మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తున్నారా? అంటూ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌పై పరకాల 12వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఆకుల లావణ్య, శ్రీధర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు" అంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్నే అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంట్‌కు వెళ్లిన వ్యక్తి మహిళల వైవాహిక జీవితం గురించి ఇంత చులకనగా, ఇంత బాధ్యతా రహితంగా మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహిళల వ్యక్తిగత జీవితం, ఆత్మగౌరవం, స్వతంత్రతపై మాట్లాడే హక్కు ఎంపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పథకాల ప్రచారం కోసం మహిళల జీవితాలను ఉదాహరణగా తీసుకోవాలా? సంక్షేమం పేరుతో ఒకవైపు మహిళలను ఆకర్షించి, మరోవైపు అదే మహిళలను అవమానించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
మహిళలు ఏ పార్టీకి ప్రచార వస్తువులు కాదని, వారి గౌరవమే మాకు ప్రాణమని స్పష్టం చేశారు. ఎంపీ బలరాం నాయక్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళా లోకానికి బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేకుంటే మహిళల ఆత్మగౌరవం కోసం బీజేపీ వీధి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు.



