రూ.1,00,500 నగదు, మూడు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పేకముక్కలు స్వాధీనం
పరకాల తెలంగాణ గళం నవంబర్ 24
పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పరకాల మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పరకాల పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ఏడుగురు నిందితులను పట్టుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పైడిపల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పరకాల పోలీస్ స్టేషన్ సిబ్బంది పక్కా ప్రణాళికతో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి పేకాటకు సంబంధించిన రూ.1,00,500 నగదు, మూడు సెల్‌ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు, పేకముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పరకాల సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పరకాల పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని సీఐ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.



