పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'తెలంగాణ చరిత్ర, సంస్కృతి' పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు మరియు వారసత్వ విశేషాలపై సమగ్ర అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో బుధవారం కరీంనగర్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ రచయిత సురేష్ సార్ రచించిన ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్.రావు, ట్రెజరర్ ఎం.డి. అలీమ్, ప్రముఖ నాయకులు మరియు న్యాయవాది నిషాని రామచంద్రం ముఖ్య అతిథులుగా హాజరై, వారి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అవగాహన ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేవలం పరీక్షల కోసమే కాకుండా, మన ప్రాంత వారసత్వ సంపదను తెలుసుకోవడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులకు విద్యాపరమైన ప్రోత్సాహం అందించేందుకు ఫౌండేషన్ తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్, కోఆర్డినేటర్ కళాశ్రీ, ఇంగ్లీష్ అధ్యాపకులు డాక్టర్ భాస్కరాచారి, ఇతర అధ్యాపక బృందంతో పాటు స్టడీ సర్కిల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






