పోటీలను ప్రారంభించిన ఆర్సిఓ డాక్టర్ శ్రావణ్ కుమార్
కమలాపూర్, తెలంగాణ గళం:
వరంగల్ ఉమ్మడి జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా స్థాయి అండర్–14, 19 క్రీడా పోటీలు మహాత్మా జ్యోతిభా ఫూలే కమలాపూర్ బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్సీవో డాక్టర్ శ్రావణ్ కుమార్, కమలాపూర్ సిఐ పి. నవీన్, హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం జె పి పాఠశాల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలోని వివిధ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల నుంచి వచ్చిన అండర్–14, 19 విద్యార్థినులు వివిధ క్రీడా విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలు చక్కని వేదికగా నిలుస్తాయన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో గౌరవ వందనాన్ని చేశారు. విద్యార్థులలో తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథులచే వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ క్రీడా పోటీలు మూడు రోజులు నిర్వహించినట్లు కార్యక్రమ సభాద్యక్షులు డాక్టర్ తాడూరు రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఒ స్టెల్లా, ప్రిన్సిపల్లు అంజిరెడ్డి, సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






