భక్తి

ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవం

శివ్వంపేట, నవంబర్ 15 (తెలంగాణ గళం): ఐదు శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ, తరతరాలుగా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా కొనసాగుతున్న శివ్వంపేట మండల కేంద్రంలోని అత్యంత పురాతన శ్రీ కోదండర…

By · · Updated

Share this article
ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవం

శివ్వంపేట, నవంబర్ 15 (తెలంగాణ గళం): ఐదు శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ, తరతరాలుగా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా కొనసాగుతున్న శివ్వంపేట మండల కేంద్రంలోని అత్యంత పురాతన శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ప్రత్యేక పూజలు, భక్తుల రామ నామస్మరణల మధ్య జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరగడంతో శివ్వంపేట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ప్రముఖ శాస్త్ర పండితులు కీ.శే. శ్రీ శాస్త్రుల అనంతరామశర్మ, కీ.శే. శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి దివ్యాశీస్సులతో, గ్రామ పురోహితులు శాస్త్రుల పురుషోత్తమ శర్మ, రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రుల పురుషోత్తమ శర్మ, దేవదత్త శర్మ, చంద్రశేఖర శర్మ, రాజశేఖర్ శర్మ, కుమార శర్మ, బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ, రాఘవేంద్ర శర్మ శ్రీ హర్ష శర్మ శ్రీ చరణ్ నటరాజ్ శర్మ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగిస్తూ, వేదోక్త విధానంలో ప్రతి కార్యక్రమాన్ని నిర్ణీత ముహూర్తాలకు అనుగుణంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. ప్రతిష్ఠోత్సవంలో భాగంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని పూలతో, తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో దేవాలయం కొత్త శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు గర్తన్యాసం, రత్నన్యాస కార్యక్రమాలను పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రతువుల్లో వేదమంత్రాలను పఠిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం ఉదయం 10 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్ణీత శుభముహూర్తంలో పురోహితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠాపన క్రతువును పూర్తి చేశారు. మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో వీక్షించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో ఆలయ ప్రాంగణమంతా భక్తుల రామ నామస్మరణలతో మార్మోగింది. స్వామివారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి, అవభృథం, ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు. యజ్ఞక్రతువులో భాగంగా పూర్ణాహుతిని సమర్పించి, అనంతరం సంప్రదాయబద్ధంగా అవభృథం నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించి కార్యక్రమాన్ని ముగించారు. ప్రతి క్రతువును శాస్త్రోక్త నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంతో ప్రతిష్ఠోత్సవం ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయం శివ్వంపేట గ్రామానికి ఒక ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా నిలుస్తోంది. పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇలాంటి పురాతన ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరగడం గ్రామ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. 

అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త

ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో కీ.శే. పబ్బ అంజయ్య, రామవ్వ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పబ్బ రమేష్ గుప్తా, స్వరూపారాణి, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అన్నదాన కార్యక్రమానికి కూడా విశేష స్పందన లభించింది. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. భక్తితో పాటు సేవా కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పబ్బ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దివంగత పబ్బ అంజయ్య, రామవ్వ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.ఈ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ఇసుగారి మల్లేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Tags: