(తిరుపతి,నవంబర్ 21, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి):
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రజలలో ఆహార భద్రత, పరిశుభ్రమైన వంట పద్ధతులు మరియు పౌష్టికాహారం పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఎన్ఎస్ఎస్ యూనిట్-9 ఆధ్వర్యంలో విద్యార్థులకు "సురక్షిత వంట పద్ధతులు మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు" అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆరోగ్య మరియు ఆహార భద్రతా నిపుణురాలు డా.ఆర్. భారతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హోమ్ సైన్స్ విభాగం, ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లోనే శుభ్రమైన వాతావరణంలో వండుకునే ఆహారమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు పరిశుభ్రమైన వంట పద్ధతులు, వంట చేసే ముందు చేతులను, కూరగాయలను శుభ్రంగా కడగడం, వంట పాత్రల పరిశుభ్రత పాటించడం వంటి ప్రాథమిక నియమాలపై అవగాహన కల్పించారు. వంటలలో నూనె, ఉప్పు మరియు చక్కెర వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని, ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరంగా విద్యార్థులకు వివరించారు.
పోషకాహార ప్రాముఖ్యత, రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, పప్పు ధాన్యాలు, మొలకలు మరియు చిరుధాన్యాలను (మిల్లెట్స్) చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకో వచ్చని సూచించారు. నిత్యావసర సరుకులు, పాలు, మసాలాలలో జరిగే కల్తీని ఇంట్లోనే సులభంగా ఎలా గుర్తించవచ్చో ప్రయోగాత్మకం గా చూపించారు. ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్, బయట కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ఉండే గడువు తేదీ, పోషక విలువల సమాచారం మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్కును తప్పనిసరిగా పరిశీలించాలని కోరారు. తదినంతరం ఎన్ఎస్ఎస్ యూనిట్-9 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. వి. జ్యోత్స్న కల్పన మాట్లాడుతూ "ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఇంటి వంటగది నుండే మార్పు మొదలవ్వాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ రోజువారీ ఆహారపు అలవాట్లలో సానుకూల మార్పులు చేసుకుంటారని ఆశిస్తున్నాము" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.