తిరుపతి, నవంబర్ 2, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:
బ్రిక్స్ లైఫ్‌స్టైల్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు “ఇంధన పొదుపు” అనే ఇతివృత్తంతో విద్యుత్ శక్తి పరిరక్షణ ప్రాముఖ్యతను, సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాన్ని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు IX, X మరియు XI యూనిట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. వి. జ్యోత్స్న కల్పన, ఎం. పల్లవి మరియు ఆర్. దివ్య సంయుక్తంగా కార్యక్రమాని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు *“ఇంధన పరిరక్షణ గంట”* నిర్వహించడం ద్వారా ప్రారంభించారు. ఈ సమయంలో అవసరం లేని విద్యుత్ పరికరాలన్నింటినీ నిలిపివేసి, విద్యుత్ పొదుపు ఆవశ్యకతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి. గోపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లను ఆపివేయడం, ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్ పరికరాలను ఉపయోగించడం, సౌర మరియు పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో ప్రొఫెసర్ వి. వీరారెడ్డి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం (రిటైర్డ్), గృహాలలో విద్యుత్ పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న దేవేంద్రనాథ్ రెడ్డి, రిటైర్డ్ సూపరింటెండెంట్, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి వివరించి, వాటి వినియోగం ద్వారా ఇంధన అవసరాలను సమర్థవంతంగా తీర్చుకోవచ్చని తెలియజేశారు. ఇంధన పొదుపు ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, సహజ వనరులను పరిరక్షించవచ్చని, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలియజేస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతం గా ఇంధనాన్ని వినియోగిస్తూ, విద్యుత్ పొదుపును తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, స్థిరమైన మరియు పర్యావరణహిత భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేయాలని సందేశాన్నిస్తూ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ బ్యూరో ప్రతినిధి ప్రొఫెసర్ లలిత కుమారి, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , యూనివర్సిటీ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.