బ్యాట్‌తో బంతిని కొట్టి టోర్నీని ప్రారంభించిన ఎస్ఐ రణధీర్, డాక్టర్ అభిరామ్.. యువత క్రీడల వైపు అడుగులు వేయాలని పిలుపు
పరకాల ,తెలంగాణ గళం, నవంబర్ 15:
పరకాల పట్టణంలో క్రీడా సందడి నెలకొంది. పరకాల పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరకాల ప్రీమియర్ లీగ్ (PPL) సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. పట్టణంలోని చింతల్ మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరకాల ఎస్ఐ రణధీర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ అభిరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు బ్యాట్‌తో బంతిని కొట్టి టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. నేటి యువత మొబైల్ ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువ క్రికెటర్లలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పరకాల ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లు చక్కని వేదికలుగా నిలుస్తాయని అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో పలు జట్లు పోటీపడనున్నాయని, విజేతలకు భారీ నగదు బహుమతులు, ట్రోఫీలతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందజేయనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు, టోర్నమెంట్ ఆర్గనైజర్లు చిన్ను, రాజేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ చంద్రకుమార్ స్వామి, ఏరుకొండ శ్రీనివాస్ నాగారం సర్పంచ్ ,ఆముదాలపల్లి అశోక్, పిట్ట సునీల్, వరికోలు సర్పంచ్ దొగ్గేల కుమారస్వాపిట్ట, పిట్ట దేవేందర్, తుమ్మ సతీష్ తదితరులు పాల్గొన్నారు.



