చింతగట్టులో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి 418వ జయంతి మహోత్సవం
హసన్‌పర్తి (హనుమకొండ జిల్లా): కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా, హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామంలో కాలజ్ఞాన ప్రబోధకులు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 418వ అవతరణ (జయంతి) మహోత్సవాన్ని విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని పోచమ్మ వీధిలో గల శ్రీ పోచమ్మ దేవాలయం ఎదుట విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు, పెద్దలు, యువకులు ఐక్యంగా చేరి స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి కీర్తనలు ఆలపిస్తూ, సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన బోధనలను స్మరించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో చింతగట్టు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
.



