పెన్షన్ల కోసం పోరాటం చేస్తాం: భోగ శ్రావణి
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
అర్హులైన నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని కమల నిలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జగిత్యాల జిల్లాలో సుమారు 2,500 నుంచి 3,000 మంది నేత కార్మికులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 19 మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కష్టపడి కుటుంబాలను పోషించుకుంటున్న నేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
గీత కార్మికులకు, అర్హులైన బీడీ కార్మికులకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని విమర్శించారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పించాలని, వెబ్సైట్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అర్హులైన పేదలకు పెన్షన్లు అందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధి, సంక్షేమం పేరుతో చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని భోగ శ్రావణి విమర్శించారు. నేత కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లు మంజూరు చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని, అవసరమైతే రోడ్డెక్కి ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, 49వ వార్డు కౌన్సిలర్ సిరిపురం శ్రీలత, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ సిరిపురం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పాత రమేష్ తదితరులు పాల్గొన్నారు.


