పరకాల, తెలంగాణ గళం, నవంబర్ 24:
పరకాల: రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఆధార్ పార్టీ నిలుస్తుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఈడా శేషగిరిరావు అన్నారు.
మంగళవారం తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ గార్డెన్స్‌లో నియోజకవర్గ ఇంచార్జ్ గునగంటి రమేష్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధార్ పార్టీ అభ్యర్థి బూర సైదారావు గౌడ్‌ను గెలిపించాలని కోరారు. ఆధార్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజల పక్షమేనని, వెనుకబడిన వర్గాలకు సమన్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రతి కార్యకర్త ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఆధార్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబోజి బుడయ్య, రాష్ట్ర ST సెల్ అధ్యక్షులు అల్లెం వెంకటేశ్వర్లు, SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు బండి రాజారాం, చేరికల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గట్టు యుగంధర్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మాటూరి కృష్ణచారి, ఎమ్మెల్సీ అభ్యర్థి బూర సైదారావు తదితరులు పాల్గొన్నారు.



